kathanilayam
 

కథానిలయం వెబ్‌సైట్‌ నిర్వాహకులు

మనసు ఫౌండేషన్

ఈ నాడు మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్క సౌకర్యం వెనుక సమస్త మానవ సమాజం కృషి ఉంది. ఏమాత్రం సౌకర్యవంతంగా బ్రతకగలిగిన వ్యక్తి అయినా ఒక విధంగా సామాజిక ఋణగ్రస్తుడే. ఈ ఎఱుక కలిగినపుడు ఆ ఋణం తీర్చుకోటానికి ప్రయత్నం జరుగుతుంది. అటువంటి ప్రయత్నంతో మనసు ఫౌండేషన్ పుట్టింది.

విశ్వ మానవుని రూపకల్పనకు పునాది వేసే తాత్విక చింతనలో ఒక భాగస్వామి సాహిత్యం. ఆ సాహిత్యాన్ని జనానికి అందించటంలో పాల్గొనడం సామాజిక ఋణం తీర్చుకోవటమే అవుతుంది. అందుకే కొన్ని సాహిత్య పరమైన కార్యక్రమాలు మనసు ఫౌండేషన్ సంకల్పించింది.

కొందరు మహా రచయితల సర్వస్వాలను ప్రచురించటం. వారి సమస్త రచనలనూ సేకరించి, ఎటువంటి మినహాయింపులూ, మార్పులూ, చేర్పులూ లేకుండా ముద్రించటం. రచనల వరసలో సాధ్యమైనంతగా కాలానుక్రమణం పాటించటం. తద్వారా ఒక రచయిత తన కాలానికి ఎలా ప్రతిస్పందించాడో, ఎలా తప్పులు చేసి దిద్దుకున్నాడో, ఎలా ఒప్పులు చేసి మెరుగుపరుచుకున్నాడో, మనమీనాడు తప్పులుగా భావించే వాటిని చేయటం వెనుక ఏ వ్యక్తిగత దౌర్బల్యాలూ, ఏ సామాజిక ఒత్తిడులూ ఉన్నాయో, మనమీనాడు ఒప్పులుగా పరిగణించే వాటిని చేయటం వెనుక ఏ వ్యక్తిగత సాహసాలు ఉన్నాయో అవగతం చేసుకునే అవకాశం పాఠకులకు కలిగించటం. కాలాన్నీ, సమాజాన్నీ, ఆనాటి మహా రచయితల పరిణామక్రమాన్నీ అర్థం చేసుకునే వెసులుబాటు కల్పించటం. ఏ మహా రచయిత అయినా తన శక్తిమీద తాను నిలబడగలడని, పాఠకులకు వివేచన, విచక్షణా ఉంటాయని మనసు ఫౌండేషన్ విశ్వాసం. ఈ భావనతో రావిశాస్త్రి, కాళీపట్నం, శ్రీశ్రీ, బీనాదేవి, పతంజలి,జాషువ ల సమస్త లభ్య రచనల సంగ్రహాలనూ వీలైనంత అందంగా, సాధికారంగా అందించటం జరిగింది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, కె.సభా మరికొందరు రచయితల సర్వస్వాలపై పని జరుగుతోంది.

మనకు చాలా చేరువగా ఉన్నా చాలా దూరంగా ఉండిపోయిన కాలం 18, 19 శతాబ్దాలు. ఈ కాలంలో మన భారతీయ సమాజం వేల సంవత్సరాలలో ఎరగని మార్పులకు గురయింది. వ్యక్తులుగా ఈనాటి మనకి వాస్తవమైన పునాది ఆ కాలమే. ఆకాలాన్ని అర్థం చేసుకోవటం ద్వారా నేటి మనకు పరిష్కారాలు చేసుకునే శక్తి పెరుగుతుంది. ఈ భావనతో నాటి సామాజిక జీవితంపై ఏకొద్ది వెలుతురుని ప్రసరింపజేసిన పుస్తకాలనైనా అవి ఏ భాషలో ఉన్నా సేకరించి తెనిగించి తెలుగు పాఠకులకు చేర్చటం. ఈ పనిలో భాగంగా 1860-90 ప్రాంతాల్లో ఒంగోలు చుట్టుపక్కల జీవితాన్ని పరిశీలించిన ‘while sewing sandals the tale of a telugu pariah tribe’ అన్న పుస్తకం అనువాదాన్ని ‘చెప్పులు కుడుతూ కుడుతూ... తెలుగు మాదిగల గాథలు’ అన్న పేరుతో ప్రచురించటం జరిగింది. కాటన్ జీవితచరిత్ర అనువాదం అందించారు.

మానవాళి మార్పులను లోతుగా పరిశీలించిన కొన్ని పుస్తకాలను తెలుగు పాఠకులకు అందించే ఆలోచన, ప్రయత్నం సాగుతోంది.

సాహిత్య పరమైన ఈ కార్యక్రమాలే కాకుండా నేరుగా సమాజానికి ఉపయోగపడే మరికొన్ని కార్యక్రమాలు మనసు ఫౌండేషన్ చేపట్టింది.

పల్లెలలో జీవనోపాధులు పెరగాలంటే ఆధునిక వస్తు సాంకేతిక పరిచయం, తత్సంబంధిత పని కౌశలం అవసరం. ఈ కౌశలం పెంపొందించేందుకు గ్రామీణ యువతకు ఓ స్వచ్ఛంద శిక్షణా కార్యక్రమం మనసు ఫౌండేషన్ సంకల్పించింది.

సాహిత్యసేవలో భాగంగా మనసు ఫౌండేషన్ తలపెట్టిన మరో ముఖ్యకార్యక్రమం ఈ కథానిలయం వెబ్‌సైట్ బాధ్యత స్వీకరించటం. ఇది కూడా తెలుగులోని అన్ని పత్రికల వివరాలను, పుస్తకాల వివరాలనూ, అవి లభ్యమయే ప్రదేశాలనూ కావలసినవారికి అందించటం అన్న ఆలోచనలో ప్రధాన భాగం.

ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు:

ManasuRayudu
SyamaNarayana
KSubbaRao
vivina
RamanaMurthy